Sunday, December 18, 2011

విశాఖవీడియో వార్తలకు స్వాగతం.

vtv విటివి వైజాగ్ న్యూస్ విశాఖపట్నం వార్తలను వీడియో రూపంలో అందిస్తుంది.ప్రతిరాత్రి
తొమ్మిదిగంటల తర్వాత ఈ బ్లాగు ద్వారా దేశవిదేశాల్లో ఉన్న విశాఖవాసులు నగరవార్తలను
ఈ బ్లాగుద్వారా చూడగలరు.మీప్రతిస్పందన కొరకు ఎదురుచూస్తున్న
మీ వీటీవీ మిత్రులు

Saturday, November 19, 2011

దూకు దూకు అన్న నాసవితే గాని......

( శ్రీరామరాజ్యం దర్శకుడు బాపు,నిర్మాత సాయిబాబా)

దూకు దూకు అన్న నాసవితే గాని దూకిన నా సవితిలేదని ఒక ముతకసామెత నాలాంటివాళ్లు వాడుతుంటారు.
ఆ సామెత లాగుంది మొన్న విడుదలైన శ్రీరామరాజ్యం కలెక్షన్లు.బాగుంది చూడండి అంటున్నవాళ్ళన్నా
కనీసం ఈ సినిమా చూస్తున్నారా?చూసారా అని అనుమానం నాకు.
అనవసరంగా అధికసంఖ్యథియేటర్లలో రిలీజ్ చేసారా అనిపిస్తుంది,
ఒక సినిమాహాలు దగ్గరున్న టీకొట్టు అతను ‘బొమ్మబాగుందిగానీ బావూ జనాలలికిడ్నేదు’,అన్నాడు
నాతోటి.కొన్ని హాళ్లలో సగానికిపైగా సీట్లు ఖాళీ.
మంచిసినిమా తీసినా మీరేమన్నా ఆదరించారా చచ్చారా అనిపించుకోకుండా బాగుంది అన్నప్పుడు
శ్రీరామరాజ్యం చూడాల్సిన అవసరం కూడా ఉందికదా.
సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు ఆ ఉంటుందిగా నింపాదిగా చూద్దాములే అనుకోవటం జనానికి
అలవాటు,ఆ జనం బయల్దేరేవరకైనా హాళ్లలో ఉండనిస్తారా అనొకనుమానం.

చెత్తన్నర సినిమా

చెత్తన్నర సినిమా కానన్ ది బార్బేరియన్-2011
హెచ్చరిక:వందలకొద్దీ చెత్తా చెదారం చూసాను కాబట్టి తట్టుకుని చూసాక నాలుగున్నర గంటల నిద్ర
(అవును పగలే)లో పడి లేవగలిగాను,నామాట కాదని ఈ సినిమా చూసారా కోమానే మీకు.ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ హీరోగా ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చిన  రెండు సినిమాల్లో
మొదటిదానికి కానన్ ది బార్బేరియన్ కు ఇది రీమేకు అనుకున్నారు గానీ,కాదు.కానీ మాంఛిమేకు
నేరుగా మెదడులోకే దిగుతుంది.ఉన్నంతలో హీరోయిన్ కాస్తబాగుంటుంది చూట్టానికి,ఇక అంతా అయోమయం
జగన్నాథం.చూడకతప్పదూ అనుకున్నవాళ్ళు ఆ పాతసినిమాల డీవీడీలు తెచ్చుకుని చూట్టం లేదా ఆ కామిక్స్
చదువుకోవటం బెటర్,తరువాత చెప్పలేదనియేరు.
http://www.imdb.com/title/tt0816462/

Friday, November 18, 2011

ఇలాంటి బళ్లను బళ్ళు అనాలా?



ఒక బడిలో రెండో తరగతి చదువుతున్న పిల్లను ఒకడు రేప్ చేస్తాడు,
ఒక బడిలో విద్యార్థినులను ఒక టీచరమ్మ బట్టలూడదీయించి
ఫోటోలు తీస్తుంది,
ఒక బడిలో స్కూల్ ఫేట్ అని మొత్తం గ్యాంబ్లింగ్ గేమ్స్ పెడతారు,
ఒక బడిలో స్కూల్ ఫేట్ కి ఆరువందలిస్తేనే లోనికి రానిస్తాం,రాకపోతే స్కూలుకే
రానివ్వం అని వార్నింగ్ ఇస్తారు,
ఒక బడిలో ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లను ఎవరో కిడ్నాప్ చేస్తారు,నెలరోజుల తర్వాత పూడ్చిపెట్టిన
శవం దొరుకుతుంది,
ఒకబడిలో బాయ్ ఫ్రెండ్ లేకపోతే ‘ షేమ్’
ఒకబడిలో ఐఫోన్ లేకపోతే ‘హౌ పాథెటికల్లీ పూర్ యూ ఆర్’
ఇలాంటి బళ్లను బళ్ళు అనాలా?ఇంకేమన్నా పేరు చెప్తారామీరు?

Thursday, November 17, 2011

చెత్తసినిమా రాబిన్ హుడ్




ఎందుకు తీస్తారో ఇలాంటిసినిమాలు?
రిడ్లీస్కాట్ లాంటి దర్శకుడు రస్సెల్ క్రోవ్,కేట్ బ్లాంఛెట్ లాంటి పెర్ఫార్మర్స్ ని పెట్టుకుని భారీ బజెట్ తో తీసిన చెత్తసినిమా రాబిన్ హుడ్ http://www.imdb.com/title/tt0955308/.
ఒక్క సన్నివేశం కూడా ఆకట్టుకోలేని విధంగా ఉండే పరమదరిద్రపు సినిమా.ఇంత దారుణంగా తీయాలంటే ఎంతో కష్టపడిఉండాలి మామూలుగా తీస్తే ఎలా ఉండేదో మరి?కెవిన్ కాస్ట్నర్ సినిమా మించిపోయుండొచ్చు అనుకుని యథాలాపంగా చూసినందుకు నాకీమాత్రం శిక్షపడాలేమో?పొరపాటున కూడా చూడకండి.దీనికంటే
Robin Hood: Men in Tights (1993)-
http://www.imdb.com/title/tt0107977/-
కోటి రెట్లు బెటర్.మెల్ బ్రూక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.
పైగా ఇది A spoof of Robin Hood in general, and 'Robin Hood: Prince
of Thieves' in particular,పొట్టచెక్కలవుతుంది నవ్వలేక.

Wednesday, November 16, 2011

ఓపిగ్గా చూడాల్సిన సినిమా ఇది


 
దారినపోయే బాటసారి తనకు ఆశ్రయమిచ్చిన కుటుంబం ఇబ్బందుల్లో పడితే అందుకు కారణమయిన వాళ్ళను అంతమొందించి మరలా తనదారిన తానుపోయే కథతో 1953లోసినిమా ఇది.క్లుప్తంగా చెప్తే ఇంతే ఉందిగానీ,ఈ పాయింటుని రెండుగంటల సినిమాగా తీర్చిదిద్దటంలో జార్జ్ స్టీవెన్స్ అద్వితీయప్రతిభ మనకు అడుగడుగునా కనిపిస్తుంది.జార్జ్ స్టీవెన్స్ కీర్తికిరీటంలో A Place in the Sun (1951),Giant(1956),Diary of Anne Frank (1959) వంటివి కూడా ఉన్నాయి.షేన్ పాత్రలో అలన్ లాడ్ చక్కగా ఉంటాడు,బులుగుచొక్కా నల్లప్యాంటూ వేసుకుని మన శోభన్ బాబు లా (మొహం మీద రింగు ఉండదు కాకపోతే).ఇందులో పాత్రపరంగా సంఘర్షణ ఎక్కువగా హీరోకి ఆతిథ్యం తర్వాత ఉద్యోగం ఇచ్చిన వాన్ హెఫ్లిన్ ది అతని భార్య పాత్రపోషించిన జీన్ ఆర్థర్ ది.మరొక చక్కటిపాత్ర హీరోకి వీరాభిమాని అయిన బాలుడిపాత్రలో బ్రాండన్ డి వైల్డ్(మొదటి సినిమా అయినా చాలా చాలా బాగా చేసాడా బుడ్డోడు అప్పటకి).హీరోని చంపటానికి వచ్చిన కిరాయి రౌడీ పాత్రలో జాక్ పాలన్స్ యథావిధిగా తనట్రేడ్ మార్కు నవ్వుతో అలరిస్తాడు.వెస్ట్రన్ జెనర్ అయినా కుటుంబానికి,స్నేహానికి స్వేఛ్ఛగా బ్రతికేందుకు దుండగులను ఎదిరించటానికి మంచి కనెక్షన్ పెట్టాడు దర్శకుడు.మంచి ప్రింట్ దొరికితే,తీరిక ఎక్కువగా ఉంటే చూడండి.అన్నట్టు ఈ సినిమా ఫోటోగ్రఫీకి ఆస్కార్ లభించింది.
http://www.imdb.com/title/tt0046303/

Monday, November 14, 2011

అల్లుడి నోట్లో శని ఉన్న సినిమా ఇది




అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నది కొన్ని సినిమాల విషయంలో రుజువవుతూ ఉంటుంది.గొప్ప కథ,ఫ్రాంకో నీరో,ఆంథోని క్విన్,ఎల్లీ వాలెచ్,క్రిస్టాఫర్ లీ,Sybil Danning లాంటి అందగత్తె,ది డీర్ హంటర్ లాంటి క్లాసిక్ కు ఎడిటర్ గా ప్రఖ్యాతి గాంచిన పీటర్ జిన్నర్ దర్శకత్వం,అన్నీ బ్రహ్మాండమే కానీ సినిమా చీదేసింది. ఇన్ని బాగుండీ సినిమా ఎందుకు ఫెయిల్ అయ్యిందో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవారు చూసితీరాల్సిన సినిమా
ది సలమండర్
.http://www.imdb.com/title/tt0083024/