Friday, November 11, 2011

గంగ పుత్రులు -రాజేష్ దేవభక్తుని



తిమింగలానికి ఆహారం, పెద్ద పెద్ద చేపలు, పెద్ద చేపలకు ఆహారం, చిన్న చేపలు. (చిన్న చేపలు సముద్రంలో ఉండే నాచు, పురుగుల వంటివి తిని బ్రతుకుతాయి). అన్ని రకాల జలచరాలు తిమింగలానికి మాత్రమె ఆహరంగానే మిగిలితే, చివరకు తిమింగలాలు తప్ప సముద్రంలో ఇంకేమి మిగలవు, ఆ మిగిలిన తిమింగలాలు తినడానికి ఎలాగు పనికిరావు. అలాగే బడా వ్యాపారవేత్తలమని చెప్పుకేనే వారి డబ్బు దాహానికి, వ్యాపార విస్తరణ ఆలోచనలకూ బలి అయ్యేవారు చిన్న చిన్న కోరికలతో, అలుపెరగని కాయకష్టంతో సముద్రంపై వలలు విసురుతూ బతికు సాగించే జాలరి వాళ్ళు / మత్స్యకారులు. వీరి జీవన సౌలభ్యానికి , జీవన బృతికి కావలిసిన అవసరాలను గురించి ప్రభుత్వం ఎలాగు పట్టించుకోదు, అయినా వీరికేం పరవాలేదు సముద్రంపై వీరికి తగినన్ని హక్కులు కల్పించినంతవరకు ...! అలా చేయకపోగా ఉన్న హక్కులను తొలగించి, వారికి సముద్రంపై ఇంత దూరమే వెళ్ళాలి , అంత దూరమే వెళ్ళాలి అని పరిమిధులు విదించి, వారి కనీస అవసరాలకు కుడా రొక్కం సంపాదించుకోలేని విధంగా, రోజుల తరబడి వారు సముద్రంపై సాగించే కృషికి విలువలేకుండా వారి జీవితాలను నాశనం చేస్తుంది ప్రభుత్వం. ఇది ఇలాగే కొనసాగితే కొన్ని దశాబ్దాల తరువాత అ అంటే " అమ్మ ", మ అంటే " మత్స్యకారుడు " అని పుస్తకాలలో బొమ్మలు చూసి తెలుసుకునే దుస్థితికి వెళ్తాం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనుకుంటాను.

పెద్ద పెద్ద బహుళ జాతి సంస్థలకు వారిష్టమోచ్చిన విధంగా జలచరాలను పట్టడానికి అనుమతులిస్తే , మత్స్యకారుల జీవితాలలో జరిగే పరిణామాల గురించి చాల చక్కగా చూపించిన చిత్రం ఇది. నా దృష్టిలో ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన చిత్రం. ఇంటువంటి ఒక మంచి ప్రయత్నం చేసిన " పి. అనిల్ కుమార్ రెడ్డి " గారికి నా అభినందనలు. ఇహ ఈ చలనచిత్రం విషయానికొస్తే ప్రజలకు చేడుచేసే ఎన్నో విషయాలను చక్కగా చూపించగలిగారు దర్శకులు :

రావు రమేష్ గారు వార్తా చానళ్ళ గురించి మాట్లాడుతూ / విమర్శిస్తూ ఈ విదంగా అంటారు " తెలుసు బురదని తెలుసు, తెలిసిన అందులోనుండి కలువలు వికసిస్తాయేమోనని ఒక నమ్మకం " అంటారు ... అలాగే " దేశంలో ఐదువందల యాభైకి పైగా టెలివిజన్ చానళ్ళు ఉంటె, వాటిలో వందకు పైగా న్యూస్ చానళ్ళు మాత్రమె ఉన్నాయని, ఇరవైనాలుగు గంటలు ఒకటే వార్తలు ఎక్కడపడితే అక్కడ రావడంతో, న్యూస్ అనేది చవక అయ్యిందని, ఆ విధంగా న్యూస్ చానళ్ళు కుడా చవకబారు వార్తలతో వస్తున్నాయని " అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఇది మాత్రం చాలా నిజం. నాకు తెలిసి ఒక వ్యవస్థపై, వ్యక్తిపై లేక సంస్థపై వార్తల ద్వారా ప్రభావం చూపించి, వార్తలకోసం ప్రజలు నిరీక్షించే విధంగా చేసిన ఒకే ఒక చానల్ " దూరదర్సన్ ". అయితే ఇప్పుడు కుడా ఒకటి రెండు చానళ్ళు ఇలాటివి ఉన్నాయనుకోండి... కాని మిగతావి వర్గాల వారిగా విడిపోయి ప్రజలకు నేత్తినోప్పిగా తయారయ్యాయి.

పేదవారి బతుకుల్లో ప్రణయం కుడా ఎంత దౌర్భాగ్యంగా, విషాదంగా మారగలదో చూపించిన తీరు అద్భుతం. ఈ విషాదాన్నంతటిని ఒక పాటగా మలచి, ఆ పాటలోని సాహిత్యం ద్వారా వినిపించి, చూపించిన తీరుకు తప్పకుండా మెచ్చుకోవలసిందే. సినిమాలోని మిగతా పాటలు, సంభాషణలు కూడా చాలా అర్ధవంతంగా ఉండి ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రేక్షకులకు చెప్పాలనుకున్న విషయానికి న్యాయం చేకూర్చాయి. అయితే ఈ సినిమా నిర్మాణ విలువలను బట్టి ఇది ఒక వ్యాపార దోరణితో నిర్మించిన సినిమా కాకుండా ఒక మంచి హేతువును దృష్టిలో ఉంచుకుని తీసిన డాక్యుమెంటరిగా నాకు తోచింది. అటువంటి ఈ సినిమాలో కధానాయకి మీద మాత్రమె చిత్రించిన మొదటి పాట కొంచెం పరిధులు దాటి చిత్రీకరించారని అనిపించింది. సహజంగా ఈ విధమయిన చిత్రీకరణ వ్యాపార దోరణి గల చిత్రాలలోనే కాన వస్తుంది, అయితే ఆ పాట సాహిత్యం మాత్రం బానే ఉంది.

చివరగా ఒక సామాన్యుడు పెద్ద వ్యాపరవేత్తలమని ముసుగు వేసుకున్న వాళ్ళని ఎం చేయకలరో / వారిపై ఎం సాధించగలరో చూపించిన తీరు హాస్యాస్పదంగా బాగుంది .... ఇలా కొన్ని మంచి హాస్య సన్నివేశాలు కుడా ఉన్నాయి. ఇలాంటి మంచి సినిమాలను మన తెలుగు వారు ఆదరిస్తే ఇంకా బాగుంటుంది....! ఇలా అంటున్నానని ఏంటయ్యా " పగటి కలలు " కంటున్నావా అనుకుంటున్నారా ...... ఏమో తెలుగులో అయితే ఇది ఒక పగటి కలగా నిలిచిపోతుంది కుడా ...!

ఈ సినిమాకు సంభందం లేక పోయినా ఇక్కడ ఒక విషయం చెప్పదలచుకున్నాను :

ఆచార్య జి.ఎన్.రెడ్డి అనే ఆయన ఎంతో శ్రమపడి / వ్యయప్రయాసలకోర్చి "తెలుగు పర్యాయపద నిఘంటువు" అనే విలువ కట్టలేని ఒక పుస్తకాన్ని వ్రాసి ముగించారు. ఆయనే అది ముద్రించిన తరువాత వృత్తి పనులు చేసుకునే కుమ్మరి, మత్స్యకారుల బాషపై పరిశోధన మొదలుపెట్టి వాటిని కుడా ముద్రించాలని ఆశించారు, కాని ఆ పరిశోదన ముగియకుండానే అయన కాలం చేసారు. ఆ విధంగా విలువైన ఇంకో రెండు పుస్తకాలు ( ఒకటి మత్స్యకారులు వాడే బాషపై పరిశోదన ) మనకి అందుబాటులోకి రాలేకపోయాయి. ఇహ మీదట అలాంటి ఒక సాహసాన్ని ఎవరైనా చేస్తారని నేనుకోను. ఎలాగు పుస్తకం రాలేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కొన్ని దశాబ్దాల తరువాత మత్స్యకారుడనే వాడే లేకపోతె, ఒక విలువైన తెగ, వారికి సంబధించిన సంస్కృతీ, సాంప్రదాయాలు తెలియనివారిగా , దురదృష్టవంతులుగా మిగిలిపోతాము. ఈ రోజు వారికి జరిగింది రేపు మనకైనా జరగవచ్చు.

1 వ్యాఖ్యలు:

GopiKrishna Gujjula said...

సమీక్ష చాల బాగా రాసారండి, అందుకు కృతజ్ఞతలు. నేను కూడా సినిమా చూసాను, నాకు చాల బాగా నచ్చింది. కోద్హిగా ఆ పాటలో శ్రుతి మించినట్టుగా అనిపించింది, అది తప్పించి మిగతా చిత్రం అంత చాల బాగా తీసారు,. అందరు తప్పక చూడవలసిన చిత్రం. అన్నట్టు దర్శకుని పేరు పి. అనిల్ కుమార్ రెడ్డి కాదు. ఆయన పేరు పి.సునీల్ కుమార్ రెడ్డి. ఈయనే ఇంతకు ముందు సొంత వూరు అనే సినిమా తీసారు, అది కూడా చాలా బాగుటుంది.